మేలో స్థానిక సమరం మండల ,జిల్లా పరిషత్ ,పురపాలక ఎన్నికలు సీఎం కేసీఆర్ వెల్లడి cm kcr meeting
మేలో స్థానిక సమరం
లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్‌లో ముగుస్తాయి
అనంతరం మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు
ఆ తర్వాత పురపాలక పోరు
కొత్త పురపాలక చట్టం రూపకల్పన
సీఎం కేసీఆర్ వెల్లడి
ప్రగతిభవన్‌లో మంత్రులు, అధికారులతో సమావేశం
బడ్జెట్‌కు తుది మెరుగులు
ఓటాన్ అకౌంట్ జనరంజకంగా ఉంటుందని వెల్లడి
శాసనసభ సమావేశాల నిర్వహణపైనా చర్చ
హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలు ముగిసిన వెంటనే మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఆ తర్వాత పురపాలక ఎన్నికలు జరపనున్నారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం మాదిరిగానే కొత్త పురపాలక చట్టాన్ని తెచ్చేందుకు సన్నాహాలు చేయాలని ఆయన ఆదేశించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, పురపాలక ఎన్నికల నిర్వహణ, బడ్జెట్ రూపకల్పన, శాసనసభా సమావేశాల నిర్వహణపై సీఎం బుధవారం ప్రగతిభవన్‌లో సమావేశం నిర్వహించారు. ఇందులో పంచాయతీరాజ్, వ్యవసాయ, సంక్షేమ, శాసనసభా వ్యవహారాల మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్‌రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, పంచాయతీరాజ్, శాసనసభ, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం స్థానిక సంస్థల ఎన్నికల గురించి చర్చించారు. లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్‌లో ముగుస్తాయని, ఆ వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఆ వెనువెంటనే పురపాలక ఎన్నికలు చేపడతామని తెలిపారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం అద్భుతంగా రూపొందిందని, అదే మాదిరిగా నగరాలు, పురపాలనకు కొత్త చట్టం అవసరమన్నారు. దీనిపై వెంటనే అధ్యయనం చేసి దాన్ని రూపొందించాలని ఆదేశించారు. దేశంలోని ఆదర్శ నగరాలు, పట్టణాలను సందర్శించి అక్కడి విధానాలను పరిశీలించి కొత్త చట్టంలో చేర్చాలన్నారు. దానిని మే నెలలో ఆమోదిస్తామని, దానికి అనుగుణంగా ఎన్నికలకు సన్నద్ధం కావాలన్నారు.
బడ్జెట్ ప్రభుత్వ సంకల్పాన్ని చాటుతుంది
2019-20 రాష్ట్ర బడ్జెట్ జనరంజకంగా ఉంటుందని, తెరాస ప్రభుత్వ సంకల్పాన్ని చాటుతుందని కేసీఆర్ తెలిపారు. ఓటాన్ అకౌంట్ అయినా సంతృప్తికరంగా అన్ని శాఖలకు కేటాయింపులు ఉంటాయన్నారు. శాసనసభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేసేందుకు నిధులుంటాయని, ఇప్పటికే నడుస్తున్న పథకాలను మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు కార్యాచరణ ఉంటుందని వివరించారు. బడ్జెట్ పద్దులకు తుదిమెరుగులు దిద్దారు. ఈ నెల 22 నుంచి జరగనున్న రాష్ట్ర శాసనసభ, మండలి బడ్జెట్ సమావేశాల నిర్వహణపైనా సీఎం చర్చించారు.
ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సీఎం దృష్టి
శాసనమండలి ఎన్నికలపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఇతర ముఖ్యనేతలతో బుధవారం సమావేశమయ్యారు. శాసనసభ్యుల కోటా కింద 5 స్థానాల ఎన్నికలకు షెడ్యూలు ఇప్పటికే వెలువడింది. త్వరలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్ర నియోజకవర్గానికి షెడ్యూలు వెలువడనుంది. ఈ నేపథ్యంలో సీఎం అభ్యర్థుల ఎంపిక గురించి కేసీఆర్ నేతలతో చర్చించారు. ఒకటి రెండురోజుల్లో ఆశావహుల జాబితాను పరిశీలించాలని నిర్ణయించారు. శాసనమండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి సీఎంను కలిసి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గ అభ్యర్థిగా ఎంపిక గురించి మాట్లాడారు. ఇంకా పలువురు నేతలు కూడా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అవకాశం గురించి సీఎంను కలిసి అభ్యర్థించారు.

Comments
Post a Comment